పది సమస్యలను సృష్టించి.. రెండు సమస్యలకు పరిష్కారం చూపి జనాల కళ్ళను సమస్యలవైపు చూడకుండా దారి మళ్లించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మించిన వారెవరూ ఉండరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు.
భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం సాకు చూపించి ముఖ్యమంత్రి ఆడుతున్న విద్య క్రీడల్లో పిల్లలు, తల్లిదండ్రులు బలిపశువులు అవుతున్నారని అన్నారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేసి ఉపాద్యాయుల కొరతను సృష్టిస్తున్నారని అన్నారు.
3 సంవత్సరాలు నుండి డిఎస్పీ నోటిఫికేషన్ లేదని ఈ కాలంలో ఎంతోమంది ఉపాద్యాయులు పదవీ విరమణ చేశారని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ సబ్జెక్టు చెప్పే ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని అడిగారు. జాతీయ విద్యావిధానం అమలు చేసేటప్పుడు విద్యార్థుల మనోభావాలను అర్ధం చేసుకోరా..? అని అడిగారు.
గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను హైస్కూల్ లో విలీనం చేయడం వలన 3 లేక 4 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందని అన్నారు. మీరిచ్చే అమ్మఒడి డబ్బులు పేద పిల్లల ఆటో ఖర్చులకు సరిపోతాయని అన్నారు. అలాంటప్పుడు ప్రతీ విద్యార్థి ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటాడు కదా అని అన్నారు.
ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి తెలివికి నా జోహార్లని అన్నారు. పిల్లలకు కావలసినది నాణ్యమైన, ఉన్నతమైన విద్య అని దానిని తుంగలో తొక్కి విద్యార్శులను, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నారని గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మఒడి, విద్యా కానుక ముసుగులో విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవాలనే ఏకైక లక్ష్యంతో ప్రతీ గ్రామంలో పాఠశాలలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఈ ప్రభుత్వం పుణ్యమా అని మళ్ళీ చవువుల నుండి పిల్లలను దూరం చేస్తుందని దుయ్యబట్టారు.
ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయక, ప్రాథమిక పాఠశాలలను విద్యార్థులకు అందుబాటులో ఉంచక జగన్ రెడ్డి ఏమి చేద్దామనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని గంటా నూకరాజు డిమాండ్ చేసారు.