కేన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలి

రామభద్రపురం:జనసేవ న్యూస్ 
విజయనగరం జిల్లాకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ కేన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జెఏసి కన్వీనర్ మమ్ముల తిరుపతిరావు డిమాండ్ చేసారు.

స్థానిక మండల పరిధిలోని మిర్తివలస గ్రామంలో విజయదుర్గ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు మజ్జి సత్యనారాయణ స్వగ్రుహంలో జిల్లా వికలాంగుల సంక్షేమం కోసం చేపట్టబోయే కార్యాచరణ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో బాగా వెనుకబడిన జిల్లాలైన విజయనగరం,శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువవుతున్నారని,ఆర్ధిక ఇబ్బందుల వలన మరణాలు కూడా ఎక్కువవుతున్నాయని అన్నారు.గుమ్మలక్ష్మీపురం, కురుపాం,సీతంపేట,కొత్తూరుపాలకొండ తదితర ప్రాంతాల నుండి విశాఖపట్నం కేన్సర్ ఆసుపత్రికి చేరేలోపే చనిపోతున్నారని

,సరే చేరినా అక్కడ కీమో థెరఫీ,రేడియో థెరఫీ చేయించుకోవడానికి ఆర్ధికంగా,రవాణా పరంగా వ్యయప్రయాసాలు పడటం అవుతుందని అన్నారు.ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో గాంధీ,టాటా కేన్సర్ ఆసుపత్రులతో పాటు కెజిహెచ్ లో ప్రభుత్వ యూనిట్ ఉందని,కావున వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని విజయనగరం జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు.ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికి,అధికారుల అలసత్వం వలన పధకాలు అర్హులకు అందడం లేదని,అందుకే జిల్లాలో విభిన్నప్రతిభావంతుల సంక్షేమం కోసం రకరకాల సంఘాలు కంటే ఒకే సంఘం ఉంటే మంచిదని,


ఈ దిశగా కొండబాబు పనిచేయడం చాలా మంచి పరిణామమని కొనియాడారు.ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోషియేషన్ వ్యవస్థాపకుడు డి.కొండబాబు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో విభిన్నప్రతిభావంతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని,అయితే అధికారుల నిర్లక్ష్యం వలన అనర్హులకు అందుతున్నాయని,గతంలో అర్హులైనప్పటికి జిల్లాలో ఆగిపోయిన సుమారు 25 ఫించన్లను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వారా  ఐక్యంగా సాధించుకున్నామని అన్నారు.

అందుకే జిల్లా స్థాయిలో ఒకే సంఘం కోసం క్రుషి చేస్తున్నామని అన్నారు.జెఏసి కో కన్వీనర్ ఇప్పలవలస గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు ప్రభుత్వ కేన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని జెఏసి అద్యక్షుడు బీశెట్టి బాబ్జీ చేసిన ఒకరోజు సత్యాగ్రహదీక్షకు సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలకు,స్వచ్ఛంద సంస్థలకు,వివిధ ప్రజా సంఘాలకు,విద్యార్ధి సంఘాలకు పేరుపేరున క్రుతజ్ఞతలు తెలిపారు.పోరాటాన్ని ప్రతీ నియోజకవర్గంలోనూ చేస్తామని,సహకరించాలని విజ్ఞప్తి చేసారు.శ్రీ విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు మజ్జి సత్యనారాయణ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కందివలస సురేష్, పప్పు సంతోష్,బాబ్జీరావు,దేవరపల్లి మహేష్,వై.రామయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.