*విజయవాడ* : విజయవాడలో ఓ సవతి తండ్రి నీచానికి ఒడిగట్టాడు. కూతురు వరసయ్యే బాలిక స్నానం చేస్తుండగా రహస్యంగా కెమెరాలో చిత్రీకరించాడు.భర్త చేసిన నీచపు పనిని గమనించిన భార్య.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్టు వెనక ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... గట్టు వెనక ప్రాంతంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు, రెండో భర్తతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మొదటి భర్తతో విభేదాల కారణంగా..
అతనితో విడిపోయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఆమె, పిల్లలు, రెండో భర్త ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు పిల్లల్లో కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఈ క్రమంలో సవతి తండ్రి కన్ను కూతురుపై పడింది. వావి వరసలు సైతం మరిచి ఆమె పట్ల నీచంగా వ్యవహరించాడు.
ఈ నెల 4న కూతురు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా.. రహస్యంగా కెమెరా ఉంచి చిత్రీకరించాడు. ఇటీవల ఓరోజు భర్త సెల్‌ఫోన్‌లో ఫోటోలు చూస్తుండగా కూతురు స్నానం చేస్తున్న వీడియో ఆ మహిళ కంటపడింది.
భర్తను నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం కూతురిని వెంటపెట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రెండో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
గత నెలలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కన్న కూతురిని కాటేశాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆమె అరవకుండా నోటిని అదిమిపట్టి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తన తల్లికి ఈ విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.