సంతకాలు లేని చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోదాడ ఎస్‌బీఐ కార్యాలయానికి లబ్ధిదారుల పరుగులు

  హుజూర్‌నగర్ 
       హుజూర్‌నగర్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ సంతకం లేకుండానే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయటంతో లబ్ధిదారులు బ్యాంక్‌కు పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
 హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ, మండలానికి కలిపి రూ.1.04కోట్ల విలువైన 104 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ నెల 18న అందజేశారు. అందులో 80చెక్కులపై కోదాడకు చెందిన ఎస్‌బీఐ మేనేజర్‌ సంతకాలు చేయకుండానే హుజూర్‌నగర్‌ రెవెన్యూ కార్యాలయానికి పంపించారు. అధికారులు కూడా చూడకుండానే వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయించారు.

ఈ చెక్కులను హు జూర్‌నగర్‌ ఎస్‌బీఐ కార్యాలయానికి తీసుకుని వెళ్లగా; సంతకా లు లేవని బ్యాంక్‌ అధికారులు తీసుకోలేదు. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా; కోదాడలోని ఎస్‌బీఐకి వెళ్లి సంతకాలు చేయించుకోవాలని సూచించడంతో 80మంది కోదాడకు పరుగు పెట్టారు. ఈ విషయమై తహసీల్దార్‌ జయశ్రీని వివరణ కోరగా కోదాడ బ్రాంచ్‌ అధికారులు సంతకం లేకుం డా చెక్కులు పంపించారని తెలిపారు.

 కోదాడ ఎస్‌బీఐ మేనేజర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి చెక్కులపై సంతకాలు చేయకముందే తనకు తెలియకుండా హుజూర్‌నగర్‌ రెవెన్యూ అధికారులు వాటిని తీసుకెళ్లారన్నారు. లబ్ధిదారులు తిరిగి తెచ్చి ఇచ్చిన చెక్కులపై సంతకం పెట్టి ఇచ్చానని తెలిపారు.