వార్డ్ వలంటీర్ ఘరానా మోసం తల్లితో కలిసి 3-కోట్లు స్వాహా

జనసేవ న్యూస్ సాలూరు(విజయనగరం) : 

       విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలోని చిట్లు వీధికి చెందిన మానాపురం రమ్య ప్రజల నుండి పొదుపు పేరుతో డబ్బులు వసూళ్లు చేసి పరారైంది.
పొదుపు పేరుతో అధిక వడ్డీ ఇస్తానని చెప్పడంతో వందలాది మంది ఆకర్షితులై వాయిదాల పద్ధతిన సొమ్ము చెల్లించారు. కాగా, మూడు రోజులుగా ఆమె అందుబాటు లో లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. 

చుట్టు-పక్కల వాకబు చేసి తాము మోసపోయామని గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల లెక్క ప్రకారం రమ్య సుమారు 3 కోట్ల మేరకు వసూళ్లు చేసి పరారైనట్లు  తెలుస్తోంది.

రమ్య తన భర్త నుంచి దూరంగా ఉంటూ తల్లి అరుణ వద్ద చిట్లు వీధిలో నివాసముంటోంది. అలాగే ప్రస్తుతం పైవీధి వలంటీర్ గా పని చేస్తోంది. అయితే ఆమె కొన్నేళ్లుగా పట్టణ ప్రధాన వీధుల్లో వ్యాపారాలు చేస్తున్న వారితోపాటు  ప్రజల నుండి పొదుపు పేరుతో వాయిదాల పద్ధతిన సొమ్ము వసూలు చేసేది. నెలకు 500, 1000 చొప్పున వసూళ్లు చేసి ఏడాది చివర్లో నిత్యావసర సరుకులను, డబ్బులను ఇచ్చేది. 

        ఇదే పద్ధతిని కొన్నేళ్లుగా చేస్తోంది. కాగా, ఇటీవల సదరు వసూళ్ల విధానాన్ని మార్చి అధిక వడ్డీని, లాభాన్ని ఆశ చూపడంతో పలువురు లక్షల్లో పొదుపు చేశారు. 
  
       అటు-వంటి వారిలో సారిక చిన నరసింహులు, సంజీవిని, అరకు పావని, నాగేంద్ర తదితరులు లక్షల్లో కట్టి మోసపోయినట్లు- పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ పక్రుద్దీన్‌ విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. బాధితుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోందని, వందల్లో ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు పోలీసులు.