*అమరావతి* : విశాఖ జిల్లాలో బీసీ యాదవ వర్గానికి చెందిన విద్యుత్ ఉద్యోగి లైన్ మెన్ బంగార్రాజు హత్యపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు.
మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనప్పటికీ ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడం విచారకరమని చంద్రబాబు రాసారు.
ప్రశాంత నగరం అయినటువంటి విశాఖపట్నం లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దారుణం అని లేఖలో పేర్కొన్నారు.
ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైందని... ఈ హత్యవెనుక వైసీపీ పెద్దల పాత్ర ఉన్నందునే చర్యలు తీసుకోడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారన్న ప్రజల అనుమానం నిజం చేయొద్దన్నారు.
బంగార్రాజు భార్య నందిని, ముగ్గురు పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయిందని... పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.