పోలీస్ కేసులతో అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లు* --- *టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

   *భీమిలి* : కరోనా కారణంగా సామాన్య జనజీవనం ఆర్ధికంగా అస్తవ్యస్తంగా తయారయితే, మరోపక్క పోలీస్ కేసులతో ఆటో డ్రైవర్లు కుదేలవుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

             స్థానికంగా ఉన్న ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గంటా నూకరాజ మాట్లాడుతూ చమురు ధరలు విపరీతంగా పెరగడం, కరోనా కారణంగా సర్వీస్ కూడా అంతంత మాత్రంగా ఉండటం ట్రావెల్ ఏజెన్సీ పై అధికభారం పడిందని అన్నారు. సామాన్యులు తన జీవనోపాధికోసం ఉపయోగించే ఆటో డ్రైవర్లకు అయితే ఈ సమస్య మరింత భారంగా తయారయిందని అన్నారు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ ఆంక్షలు ఆటో డ్రైవర్లను మరింత కుంగదీస్తున్నాయని గంటా నూకరాజు అన్నారు.

 ఆటోలు రోడ్డెక్కుతే ఏ కేసుకు భళికావలసి వస్తుందోనని ఆందోళనలో ఉన్నారని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించి ఆటోలను నడిపితే మందలించడం తప్పుకాదని, కానీ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి కేసులు పెట్టి ఆటో డ్రైవర్లను మానసికంగా ఉబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఓవర్ లోడ్ ఉందని, ఆటోలో ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారని, ఆర్టిఓ కార్యాలయం నుండి నెంబర్ ప్లేట్ రావడం లేటయితే అదికూడా ఆటో డ్రైవర్లదే తప్పు అన్నట్లుగా కేసులు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కారణంగా ఆటోలమీద అధిక భారం పడిందని, దీనికితోడు పోలీస్ కేసులు ఆటో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని అన్నారు.

 ప్రభుత్వ ఆటోలకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చి గొప్పలు చెబుతోందని, కానీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కంటే చమురు ధరలు పెరగడం, పోలీస్ కేసుల కోసం చెల్లించే డబ్బులు ఎక్కువ ఉంటున్నాయని దీనికారణంగా డ్రైవర్లు అనేకరకాలైన ఇబ్బందులకు గురవుతున్నారని గంటా నూకరాజు అన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్లపై సానుకూలంగా పోలీస్ శాఖ గాని, ప్రభుత్వం గాని ఆలోచించాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు.

         ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు రానా, జనరల్ సెక్రెటరీ, టి.ఎన్.టి.యు. సి.అధ్యక్షులు వియ్యపు పోతురాజు, డ్రైవర్లు వాసుపల్లి వంశీ, గంగాధర్, లోకేష్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Reporter
సురేశ్