నకిలీ గ్రాన్యూల్స్ (గుళికలు) తయారీ ముఠా అరెస్ట్ : డిఐజి రంగనాధ్

- - వాడపల్లి కేంద్రంగా నకిలీ గ్రాన్యూల్స్ తయారు చేసి విక్రయిస్తున్న ముఠా
- - పదివేల ఎకరాలలో రైతులు నష్టపోకుండా కాపాడిన జిల్లా పోలీసులు
- - నిందితుల నుండి 200 లీటర్ల డిఎంఎఫ్ లిక్విడ్, మిల్లర్, సింథటిక్ రంగు బస్తాలు, 38 టన్నుల గ్రాన్యూల్స్, రెండు వెమెంట్ మిషన్స్, బస్తాలు కుట్టే మిషన్ స్వాధీనం

నల్లగొండ : వాడపల్లి కేంద్రంగా నకిలీ గ్రాన్యూల్స్ (గుళకలు) తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ గ్రాన్యూల్స్ ముఠా అరెస్ట్, వారి నుండి స్వాధీనం చేసుకున్న వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. 

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సింథనూర్ కు చెందిన యేలూరి శ్రీనివాస్ గతంలో సింధనూర్ గ్రామంలో ఉన్న KVM-BIOTECH కంపెనీలో సేల్స్ మెన్ గా పని చేసాడని, అతని స్నేహితుడైన కొత్తపల్లి శ్రీనివాస్ ద్వారా సంజయ్ ఇన్ సెక్తిసైడ్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేసిన హైదరాబాద్ కు చెందిన విజయ్ శేఖర్ తో పరిచయం ఏర్పడగా ఇద్దరు కలిసి నకిలీ గ్రాన్యూల్స్ తయారు చేసి అక్రమముగా డబ్బు సంపాదించవచ్చని భావించారని తెలిపారు. 

ఈ క్రమంలో విజయ్ శేఖర్ ముంబయికి చెందిన సిగ్మా కంపెనీ నుండి DMF లిక్విడ్ ఏలూరు శ్రీనివాస్ పేరుతో బుకింగ్ చేసి మిర్యాలగూడకు పంపించారని, ఏలూరు శ్రీనివాస్ లైమ్ స్టోన్ చిప్స్ గురించి ఆచూకీ తెలుసుకోగా నల్లగొండ దామరచర్ల మండలం వాడపల్లిలో సున్నపు రాయి మిల్లులు ఎక్కువ ఉన్నందున అక్కడ చిప్స్ దొరకడమే కాకుండా నకిలీ గ్రాన్యూల్స్ తయారీకి సైతం వాడపల్లి అనువైన స్థలమని నిర్ణయించుకొని వాడపల్లి శివారు లో ఉన్న అయ్యప్ప స్వామి గుడి వెనుక అద్దంకి-నార్కట్ పల్లి హైవే కి దగ్గర్లో నిర్మానుష్య ప్రదేశాన్నీ ఎంచుకున్నారని చెప్పారు.

 వీరు ముడి సరుకును అంతా సమకూర్చుకున్న తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాడపల్లి పక్కనే ఉన్న దాచేపల్లి గ్రామం నుండి కూలీలను తీసుకువచ్చి వారితో, రంగు రాళ్ల ముగ్గు తయారు చేస్తున్నామని చెప్పి కూలీలను నమ్మించినట్లు చెప్పారు. డిఎంఎఫ్ లిక్విడ్, కొర్రాజిన్, సింథటిక్ కలర్, లైమ్ స్టోన్ చిప్స్ లను కలిపి 25 కిలోల బ్యాగుల రూపంలో విజయ్ శేఖర్ కు పంపించేవాడని, అక్కడ విజయ్ శేఖర్ వీటిని గతంలో తాను పని చేసిన, మూతపడిన సంజయ్ ఇన్ సెక్తిసైడ్స్, మ్యాట్రిక్స్ కంపెనీకి చెందిన అయిదు కిలోల కవర్లలో ప్యాక్ చేసి వాటిని కర్ణాటకకు శివకుమార్ కు ట్రాన్స్ పోర్ట్ చేసేవాడని తెలిపారు. 

తిరిగి నకిలీ గుళికల తయారీకి డబ్బులు సమకూర్చుకునేందుకు అంతకు ముందు తయారు చేసిన 7 టన్నుల నకిలీ గ్రాన్యూల్స్ ప్యాకెట్లలో కొన్నింటిని దామరచర్ల లోని రైతు మిత్ర ఫెర్టిలైజర్ షాపులో అమ్మడానికి వచ్చిన సమయంలో ఆ షాప్ యజమానికి అనుమానం వచ్చి సంబందిత వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వడంతో, వాటిని నకిలీ గ్రాన్యూల్స్ ప్యాకెట్లు గా గుర్తించి, వాడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించగా ఏలూరు శ్రీనివాస్, విజయ్ శేఖర్ ఇద్దరికి ఎలాంటి అర్హతలు లేకున్నా మోస పూరితంగా, అక్రమ ధనార్జన కోసం నకిలీ గుళికలు తయారు చేసి వాటిని శివ కుమార్ ద్వారా అమాయక రైతులకు అమ్మి అక్రమముగా డబ్బు సంపాందిస్తున్నట్లుగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. 

అనంతరం నకిలీ గుళికలు తయారు చేస్తున్న ప్రాంతంతో పాటు నిల్వ వుంచిన నకిలీ గ్రాన్యూల్స్ బస్తాలతో పాటు హైదరాబాద్ ఆటోనగర్ లో వున్న విజయ్ శేఖర్ ను అదుపులోకి తీసుకొని, అతని గోడౌన్ లను సీజ్ చేయడంతో పాటు నకిలీ గుళికల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి రంగనాధ్ వివరించారు.

 ఈ కేసులో ఇప్పటి వరకు కర్ణాటక సింథనూర్ కు చెందిన ఏలూరు శ్రీనివాస్, హైదరాబాద్ కు చెందిన విజయ్ శేఖర్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుమారు 10వేల ఎకరాలలో రైతాంగం పంట నష్టపోకుండా నల్లగొండ జిల్లా పోలీసులు కాపాడగలిగారని డిఐజి రంగనాధ్ వివరించారు. 

వాడపల్లి వద్ద ఏలూరు శ్రీనివాస్ వద్ద నుండి 200 లీటర్ల DMF లిక్విడ్ డ్రమ్ము, ఏలూరు శ్రీనివాస్ పేరు మీద DMF లిక్విడ్ కొనుగోలు చేసిన బిల్లు, 1 కే‌జి సింథటిక్ రంగు గల బస్తా, ఒక కాంక్రీట్ మిల్లర్, 800 బస్తాల నకిలీ గ్రాన్యూల్స్ (ఒక్కోక్క బస్తా 25 కే‌జి ల బరువు కలిగినవి), 70 నకిలీ గ్రాన్యూల్స్ ప్యాకెట్లు (Sanfuran 3G & Matrifuron 3G ఒక్కోక్క ప్యాకెట్ 5 కే‌జి ల బరువు కలవి) తో పాటు హైదరాబాద్ గోడౌన్ నందు A-2 విజయ్ శేకర్ వద్ద నుండి 850 నకిలీ గ్రాన్యూల్స్ ప్యాకెట్లు (Sanfuran 3G & Matrifuron 3G) ఒక్కోక్క ప్యాకెట్ 5 కే‌జి ల బరువు కలవి), 120 బస్తాల నకిలీ గ్రాన్యూల్స్ (ఒక్కోక్క బస్తా 25 కే‌జి ల బరువు కలవి), రెండు (2) వెమెంట్ మెషీన్ లు సిగ్మా కంపనికి చెందినవి, ఒక బస్తాలు కుట్టే ఒక మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి పర్యవేక్షణలో కేసు విచారణ, సమర్ధవంతంగా పని చేసిన మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, మిర్యాలగూడ రూరల్ సిఐ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ సిఐ రౌతు గోపి, వాడపల్లి ఎస్.ఐ. విజయ్ కుమార్, ఎస్.ఐ. నరేష్, కానిస్టేబుల్ శశి, ఐటి సెల్ కానిస్టేబుల్ మధు, మురళీమోహన్(జన సేవ) రిపోర్టర్, ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

Reporter
మూరలి మోహన్