*విజయనగరం* : సంచలనం సృష్టించిన మహిళా ఎస్.ఐ కె.భవాని(25) ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని వెల్లడైంది.
డిపార్టు మెంటల్ ట్రైనింగ్ లో భాగంగా క్రైమ్ ట్రైనింగ్ కోసం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి నుంచి వెళ్లిన మహిళా ఎస్సై కె.భవాని శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విశాఖపట్టణంలోని తన సోదరుడికి ఫోన్ చేసి శిక్షణ అయిపోయిందని చెప్పింది. ఆదివారం ఉదయం తిరిగి రావాల్సి ఉండగా..
ఏం జరిగిందో గాని గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
పోలీసు శాఖకు చెందిన మహిళా ఎస్.ఐ, అవివాహితురాలైన కె.భవాని (25) సఖినేటిపల్లి మహిళా పోలీసు స్టేషన్ లో అడిషనల్ ఎస్సై గా పనిచేస్తున్నారు. 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ తూర్పు గోదావరి జిల్లా రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ తీసుకుంది. అవివాహిత అయిన భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం.
వారం రోజుల క్రితం విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో క్రైమ్ శిక్షణకు వెళ్లిన భవాని శనివారం మధ్యహ్నానికి శిక్షణ పూర్తి చేసుకుని ఆదివారం తిరిగి వెళ్లాల్సి ఉండగా..ఆదివారం ఉదయం గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాల కోసం గాలించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె మొబైల్ ఫోన్ లో ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అయితే గదిలోని ఒక పుస్తకంలో మాత్రం ‘‘ ఈరోజు నేను చనిపోతున్నా..’’ అనే వాక్యం రాసిపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు అర్థమవుతోందని, అన్ని కోణాల్లో శాస్త్రీయంగా దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికి తీస్తామని, ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు నిర్ధారించుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Reporter
సురేశ్