రాష్ట్ర్రంలో జాతీయ క్రీడా హబ్ గా విశాఖ l పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

జనసేవ  పత్రికా ప్రకటన 
విశాఖపట్నం,
 విశాఖపట్నాన్ని జాతీయ క్రీడా హబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఏ.యూ. ఇంజనీరింగ్ కళాశాల లోని డా.వై.వి.యస్. మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

 ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మట్టిలో మాణిక్యాలుగా వున్న క్రీడాకారులను వెలికితీసి వారికి తగిన శిక్షణ నిచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా పోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజును క్రీడా దినోత్సవంగా చేసుకుంటున్నామని, ఒలింపిక్స్ లో దేశానికి హాకీలో స్వర్ణ పతకాలు సాధించిన హాకీ మాంత్రికునిగా ధ్యాన్ చంద్ కు పేరున్నదని చెప్పారు. 

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రీడలకు, క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. గత రెండు సంవత్సరాలలో క్రీడాకారులకు రూ.2 లక్షల 50 వేలు అందించారన్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడాకారులకు అవసరమైనవ మౌలిక వసతుల కల్పన, ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు, పౌష్ఠికాహారంతో పాటు శిక్షణనివ్వడం మొదలైన అంశాలతో ఈ పాలసీ వుంటుందన్నారు. రానున్న కాలంలో రాజధాని కాబోతున్న విశాఖకు క్రీడారంగంలో మంచి భవిష్యత్తు వుంటుందన్నారు. నగరం,జిల్లా నుండి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు గా ఎదిగారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.  


శాప్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసం, ఆరోగ్యంతో పాటు వినోదాన్ని కూడా కలిగిస్తాయన్నారు. మనిషిలో పట్టుదల, కృషి, వ్యక్తిత్వం పెంచుతాయన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు ఆటలు, క్రీడలు ఎంతో అవసరమని చెప్పారు. క్రీడలు లేకపోవడం మూలగా కొంత మంది విద్యార్ధులు చదువులో తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని మానసిక వైద్యులు చెప్పారన్నారు. విశాఖ ప్రఖ్యాత క్రీడాకారులకు పుట్టినిల్లని, నగరంలో, జిల్లాలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత నిస్తారని చెప్పారు.  

 సభకు అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు మాట్లాడుతూ విద్యార్ధి దశలో ప్రత ఒక్కరూ ఆటలు ఆడాలని, ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని పిలుపు నిచ్చారు. తనకు విద్యార్ధి దశలో అన్ని క్రీడలలో ప్రవేశం వుందని చెప్పారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి క్రీడాకారులకు పోత్సహిస్తున్నట్లు చెప్పారు. 

 ప్రముఖ క్రీడాకారులు, కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. క్రీడలలో విశేష ప్రతిభ కనబరచిన, శిక్షణలను ఇచ్చిన జిల్లాలోని ఆరు పాఠశాలలకు అవార్డులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో నెడ్ కేప్ చైర్మన్ కె.కె.రాజు, విద్యా మౌలిక వసతుల సంస్థ చైర్మన్ మళ్ల విజయప్రసాద్, శాసన సభ్యులు టి.నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, , క్రీడాకారిణి అయిన కార్పొరేటర్ ఉషశ్రీ, డి.ఈ.ఓ. లింగేశ్వర రెడ్డి, జిల్లా క్రీడాధికారి సుర్యారావు, జున్ గెలియట్, ప్రముఖ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 

జారీ డివిజనల్ పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం