" తెలుగు లోగిలి "
""""""""""""""""""""""
మా పెరటి జామచెట్టు
తెలుగు తేనెపట్టు తొడిగి
అమృత బిందువుల్లాంటి " అఆఇఈ "లను
తేనెచుక్కల్లా రాలుస్తోంది!
మా వాకిటి తులసిమొక్క
ఆంధ్రపత్రాలు చిగురించి
ఆకుల్లో యాభైఆరక్షరాల వర్ణమాలను
అందంగా చిత్రిస్తోంది!!
మా ముంగిటి ముత్యాలముగ్గు
ఇంద్రధనుస్సులా విరబూసి
ఒక్కోరంగులో పంచ మహాకావ్యాలను
వెన్నువిరిచి నిలుపుతోంది!
మా పంటపొలం
బంగారుకంకుల సరుడు దాల్చిన
ఆముక్తమాల్యదయ్యి
ప్రౌఢవ్యాకరణమంతా పరిఢవిల్ల చేస్తోంది!
మా అమృతపాణి అరటిచెట్టు
బారెడంత గుణింతాల జీబులేసి
జానుతెలుగు తియ్యదనాన్ని
జిహ్వనిండా నింపుతోంది!
మా గోడవారనున్న నల్లగోరింట పొద
తెలుగుతల్లి పాదాలకు పారాణి దిద్ది
అక్షరాల అరుణోదయాన్ని
అంకురింప చేస్తోంది!
చూసే కనులుంటే
కనిపించేదంతా తెలుగుమయమే!!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
-----శివకుమార్ పేరిశెట్ల.....
సరస్వతీపుత్ర కళాపీఠం
మైపాడు
రిపోర్టర్
నెలటూరుబాలాజి..