జీవీఎంసీ 46వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కట్టుమూరి సతీష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల జీవీఎంసీ 46వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కట్టుమూరి సతీష్ ని విశాఖ నగర రెండో డిప్యూటీ మేయర్ గా అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.


ఈమేరకు జివిఎంసిలో జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున్ అధికారికంగా రెండో డిప్యూటీ మేయర్ గా కట్టమూరి సతీశ్ పేరును శుక్రవారం ప్రకటించారు. సతీష్ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు తమ మద్దతు తెలిపారు. 

గతంలోనే సతీష్ పేరును పార్టీ ప్రకటించగా నేడు కౌన్సిల్ సమావేశంలో సతీష్ నామినేషన్ సమర్పించారు. ఈపోటీకి ప్రతిపక్ష టీడీపీ దూరంగా ఉంది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.


ఈ సంధర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జేవీఎంసీ రెండో డిప్యూటీ మేయర్ గా కట్టమూరి సతీశ్ ను ఎంపిక చేశారని అన్నారు. 

జీవీఎంసీ చరిత్రలో డిప్యూటీ మేయర్ గా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకోవడం ఇదే తొలిసారని అన్నారు. 



గతంలో దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవారని.. సీఎం జగన్ వారికి రాజ్యాధికారం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండటం తనను విస్మయపరచిందని మంత్రి అన్నారు. 

దళితులను ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబు.. వారికి సంఘంలో గౌరవం,  హోదా, పదవులు దక్కుతుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. కౌన్సిల్ లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా.. 

ఎన్నికకు సీపీఐ, సీపీఎం, జనసేన మద్దతు ఇచ్చాయని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. టీడీపీకి రాజకీయాలు కావాలి గానీ అభివృద్ధి వారికి అవసరం లేదని అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అభివృద్ధిని అడ్డుకోవడమే తప్ప చంద్రబాబు అండ్ టీమ్ కి తెలుసని ఎద్దేవా చేశారు. విద్యాధికుడైన సతీష్ రెండో డిప్యూటీ మేయర్ గా బాగా పనిచేసి నగరాభివృద్ధిలో భాగమవుతారని అన్నారు. 


విశాఖ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని మంత్రి ఈసందర్బంగా పునరుద్ఘాటించారు.



డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆశీర్వాదంతోనే తనకీ పదవి దక్కిందని .. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గతంలో దళితులకు పదవులు దక్కడం చాలా అరుదు అని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు రాజ్యాధికారం కల్పిస్తూ సంఘంలో తగిన గుర్తింపును ఇస్తున్నారని అన్నారు. 

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేసి జేవీఎంసీ ప్రతిష్ట పెంచుతామని.. నగరాభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని అన్నారు.

మేయర్ హరి వెంకట కుమారి, మరో డిప్యూటీ మేయర్ శ్రీధర్ తో కలిసి ముందుకు వెళ్తానన్నారు.

 ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ నగర మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్ నాథ్, అదీప్ రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, డిప్యూటీ మేయర్ జి.శ్రీధర్, జీవీఎంసీ చీఫ్ విప్, ఆరో వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనసేవ న్యూస్: 


ఈ పోస్ట్ ని మే ప్రియమైన వారి అందరికీ పాంపించండి.